20, డిసెంబర్ 2016, మంగళవారం

Real christmas parts 1-4

CRISTMAS

*క్రిస్మస్* ( మొదటి భాగము)

 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11
 ...........................
 *క్రిస్మస్ అంటే?*
 • దేవుని ప్రేమ లోకానికి ప్రత్యక్షం కావడం. • దేవుని మహిమ శరీరధారిగా లోకానికి దిగిరావడం. • సంతోష, సమాధాన, రక్షణ సువార్తమానం క్రిస్మస్ అంటే? క్రీస్తును ఆరాధించడం. క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన కాని నేటి, "క్రైస్ట్ మాస్ లో క్రైస్ట్ మిస్" అయిపోతున్నాడు. కారణం? నేటి క్రిస్మస్!! "ఇంటి పైన స్టార్ ఇంట్లో బార్" లా మారిపోయింది. నేటి క్రిస్మస్ 1. ఇంటి క్రిస్మస్: ఇంటి శుభ్రం 2. ఒంటి క్రిస్మస్ క్రొత్త బట్టలు 3. పంటి క్రిస్మస్ వండుకొని తినడం వీటికే పరిమితం. క్రీస్తుఆరాధనా కాస్త క్రిస్మస్ సెలబ్రేషన్స్ లా మారిపోయాయి. సెమి క్రిస్మస్ లు, మెగా క్రిస్మస్ లు, గ్రాండ్ క్రిస్మస్ లు అంటూ ... ఏవోవో పేర్లు. ఎన్ని పేర్లు పెట్టినా, ఆ క్రిస్మస్ లో క్రీస్తుకు స్థానం వుందా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. వాటిలో వేసే డాన్సులు రికార్డింగ్ డాన్స్ కి ఎంతమాత్రం తీసిపోవు. అదేంటి అంటే? దావీదు నాట్యం చెయ్యలేదా? అంటూ క్లారిఫికేషన్. దావీదు నాట్యం చేసిన సందర్భం వేరు. నాట్యం చేసినా? ఆయన ఒక గ్రూపు తయారుచేసి స్టెప్పులు నేర్చుకొని నాట్యం చెయ్యలేదు. క్రిస్మస్ ఎందుకింత వికృత రూపం దాల్చుతుంది? కారణం ఒక్కటే? ఆయన జన్మించి రెండువేల సంవత్సరాలు దాటిపోయినా? నేటికీ మన హృదయాల్లో జన్మించక పోవడమే. ఒకరేమో క్రిస్మస్ చెయ్యకూడదంటారు. మరొకరేమో చేసి తీరాలంటారు. కొందరేమో ఫరో, హేరోదు మాత్రమే పుట్టిన రోజులు జరుపుకున్నారు అని వాదిస్తుంటే? మరి కొందరేమో క్రిస్మస్ అంటే, అసలు క్రీస్తు పుట్టిన రోజు కాదని, క్రీస్తు ఆరాధన అని, క్రిస్మస్ చెయ్యవద్దు అంటే? క్రీస్తుని ఆరాధించ వద్దని అర్ధం అంటారు. కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకో! దేవునికి దగ్గరయ్యే పని ఏదయినా చెయ్యి. దేవునికి దూరమయ్యే పని ఏదీచెయ్యొద్దు. క్రీస్తుని ఆరాధించాలంటే? *ఆరాధించే హృదయం నీకుంటే చాలు*. మరేది అవసర్లేదు. ఇంతకీ ఈ క్రిస్మస్ నిన్ను దేవునికి దగ్గర చేస్తుందా? దూరం చేస్తుందా? నీ జీవితంలో అనేక క్రిస్మస్ లు దొర్లిపోయాయేమో? కనీసం ఈసారి అయినా నిజమైన క్రిస్మస్ ను ఆరాధన చెయ్యగలవా? నేడే ప్రియరక్షకుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం! క్రిస్మస్ తెచ్చే శాంతిని, సమాధానాన్ని అనుభవిద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్! క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!

 *క్రిస్మస్* (రెండవ భాగము) దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11 ..........................
. క్రిస్మస్ అంటే? క్రీస్తు పేరుతో వ్యాపారమా? అట్లానేవుంది కదా? *ప్రపంచ చరిత్రలో ఎక్కువ వ్యాపారం జరిగేది క్రిస్మస్ దినాల్లోనేనట. *ఎక్కువ మద్యం అమ్ముడుపోయేది క్రిస్మస్ దినాల్లోనేనట. *క్లబ్ లు , ఫబ్ లు, రెస్టారెంట్లు రద్దీగా వుండేది క్రిస్మస్ దినాల్లోనేనట. క్రిస్మస్ పేరుతో క్రీస్తుని ఆరాధించడం మాని, క్రీస్తునే అమ్మేసు కొంటున్నాము. ఇస్కరియోతు యూదా క్రీస్తుని 30 వెండి నాణెములకు అమ్ముకున్నాడు గాని, మనమయితే మూడు రూపాయలకే అమ్మేసేవాళ్ళమేమో? *పేరుకు మాత్రమే క్రిస్మస్ ఆరాధించు కొనేది మాత్రం "మనకు మనమే". *మన టేలంట్ చూపించుకోవడానికి క్రిస్మస్ ను వేదికగా మలచుకొంటున్నాం. *క్రిస్మస్ ఆరాధనలో సినిమా పాటలకు సహితం డాన్స్ చేసే దుస్థితికి దిగజారిపోయాం. ఒక్కమాటలో చెప్పాలంటే? *క్రిస్మస్ లో, కనీసం క్రిస్మస్ ట్రీ కి, క్రిస్మస్ తాతకిచ్చిన ప్రాధాన్యత కూడా క్రీస్తుకు ఇవ్వలేక పోతున్నాం. *ఆరాధించాల్సిన దేవుని సంగతే మరచిపోతున్నాం. దీనికేనా మనం క్రిస్మస్ అని పేరు పెట్టుకున్నది? ఆరాధించే మనసులేకపోతే? ఆరాధించడం చేతకాకపోతే? చేతులు కట్టుకొని కూర్చోవడం శ్రేయస్కరం. అంతేగాని, క్రిస్మస్ పేరుతో ఆయన అద్భుతమైన త్యాగాన్ని లోకంలో నవ్వులుపాలు చేసే ప్రయత్నం చెయ్యొద్దు. అందుకే ఆయన అంటున్నాడు. మిమ్మును బట్టియే కదా నా నామం అన్య జనుల మధ్య దూషించ బడుచున్నది? అవును! మన ఆరాధన ఆయనను దూషణ పాలుచేసేదిగా కాకుండా, ఆయనకు మహిమ తెచ్చేదిగా వుండి, అనేక మంది అన్య జనులను రక్షణ లోనికి నడిపించేదిగా వుండాలి. ఇదెప్పుడు సాధ్యం? ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు మాత్రమే. లేకపొతే, నీవు చేసే ఆరాధన ఒక ఆచారమౌతుంది తప్ప, ఆయనకు మహిమను, నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొని రాలేదు. నీ హృదయం ఆయనకింకా దూరంగానుందా? నేడే ఆయనను చేర్చుకో! ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్! క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!

 *క్రిస్మస్* (మూడవ భాగము) యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి మత్తయి 2:2 ........................... 
స్టార్ (నక్షత్రం):
(స్వయంగా ప్రకాశించేది) ఈలోకంలో చాలా స్టార్స్ వున్నాయ్. *సూపర్ స్టార్ *టెరా స్టార్ *మెగా స్టార్ *ఈ స్టార్స్ గా పిలువబడే వారిని వెంబడించేవారు లోకంలో కోకొల్లలు. *ఈ స్టార్స్ వెలుగులో ఉన్నవారిని చీకటిలోనికి తీసుకెళ్తారు తప్ప, చీకటిలోనున్న వారిని వెలుగు లోనికి నడిపించలేరు. అయితే, ప్రకాశ మానమైన నక్షత్రం ఒకటుంది. అది, *ప్రకాశించింది. *అత్యానందాన్నిచ్చింది *దారి చూపించింది. *గమ్యం చేర్చగలిగింది. యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువచుక్కయునై యున్నాను. ప్రకటన 22:16 ఆ స్టార్ మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు. * ఈ స్టార్ కున్న 5 కోణాలు, ప్రియ రక్షకుని 5 గుణగణాలను తెలియజేస్తున్నాయి. 1.ఆశ్చర్యకరుడు 2.ఆలోచనకర్త 3.బలవంతుడైన దేవుడు 4.నిత్యుడగు తండ్రి 5.సమాధానకర్త యెషయా 9:6 ఇంతకీ నీ గమ్యమేమిటి? ఏ స్టార్ ని వెంబడిస్తున్నావ్? * ఈ లోకంలో స్టార్స్ ని నీవు కలవాలంటే? నీకు ఎప్పటికీ అనుమతి దొరకక పోవచ్చు. కాని, ఈ స్టార్ నిన్ను కలసుకోడానికి దివి నుండి భువికి దిగి వచ్చింది. *ఈ లోకంలో స్టార్స్ నిన్ను నలిపేస్తారు. కాని, ఈ స్టార్ నీకోసం నలిగిపోయింది. దివి నుండి దిగి వచ్చిన స్టార్ ను వెంబడించ గలిగితే? *ఆశ్చర్య క్రియలు నీ జీవితంలో అనుభవిస్తావ్. *నీ ప్రతీ పరిస్థితిని పరిష్కరించుకోగల ఆలోచన దొరుకుతుంది. *నీ బలహీన సమయాల్లో ఆయనే నీ బలం. *నిత్యమూ నీకు తండ్రిగా ఉంటాడు. *నీ జీవితమంతా సమాధానమే. ఇదెప్పుడు సాధ్యం? *ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు మాత్రమే. *ఆ స్టార్ ను వెంబడించినప్పుడు మాత్రమే. *నీ హృదయం ఆయనకింకా దూరంగానుందా? నేడే ఆయనను చేర్చుకో! ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

 క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక! ...........

 *క్రిస్మస్*......... (నాలుగవ భాగము)

 *క్రిస్మస్ తాత*: క్రిస్మస్ లో క్రీస్తు ఉన్నాడో లేదో తెలియదు గాని, క్రిస్మస్ లో క్రిస్మస్ తాత లేకపోతే అది క్రిస్మస్సే కాదు. *క్రిస్మస్ లో క్రిస్మస్ తాత క్రీస్తునే మించి పోయాడు.* క్రిస్మస్ ను చాలామంది x-mas(ఎక్స్ మాస్ ) అని పిలుస్తుంటారు. అది నిజమే అనిపిస్తుంది కూడా. లెక్కలు మాస్టారు "తెలియని దానిని" x (ఎక్స్ )అనుకోండి అని చెప్తారు. లెక్క చివర్లో ఆ "x" (ఎక్స్ )విలువ ఎంతో చెప్తారు. *x-mas*: "x"అంటే? తెలియబడనిది "mas"అంటే? ఆరాధన x-mas పేరుతో "తెలియని దానినే ఆరాధిస్తున్నాం." ఆ "x" (ఎక్స్ ) ఏంటో నేటికీ కనుగొనలేని పరిస్థితిలోనే ఉన్నాము. 4 వ శతాబ్ధంలో, టర్కీ దేశంలో నికోలస్(శాంతా క్లాజ్) అనే వ్యక్తి ఉండేవాడు. సంపన్న కుటుంబములో పుట్టి పెరిగి, చిన్నప్పుడే తలిదండ్రులు కోల్పోయాడు. ఇతడు చాలా జాలిగల హృదయం కలిగిన వాడు. ప్రజల అవసరాలు తెలుసుకొని రహస్యముగా వెళ్లి కొంత సొమ్ము వారింట్లో వేసి వస్తుండేవాడు. చిన్న పిల్లల విషయంలో కూడా అట్లా జరిగేది, పెద్ద వాళ్ళు చెప్పడంవల్ల డిసెంబర్ 24 రాత్రి క్రిస్మస్ తాత వచ్చి రహస్యంగా బహుమతులు ఇచ్చి వెళ్తాడని వాళ్ళు నమ్మేవారు. తర్వాత కాలంలో ఆయన సెయింట్ గా పిలువబడి, బిషప్ గా కూడా పని చేసినట్లు చరిత్ర చెబుతుంది. క్రిస్మస్ అంటే? బహుమతుల పండుగని, యేసు క్రీస్తు ఈ లోకానికి బహుమానంగా అనుగ్రహించ బడ్డాడని, క్రిస్మస్ సందర్భముగా ఒకరికొకరు బహుమతులిచ్చు కోవడం, గ్రీటింగ్స్ పంపుకోవడం చేస్తుంటారు. ఫేస్ బుక్, వాట్సాప్ వంటివి వచ్చాక వీటికి అంతేలేదు. నికోలస్(శాంతా క్లాజ్) కూడా ఇట్లా బహుమానాలు ఇచ్చేవాడని తీసుకొచ్చి క్రిస్మస్ లో అంతర్భాగం చేసేసారు. అది ఎంత వరకూ వచ్చిందంటే? పిల్లలకు క్రీస్తు అంటే తెలియక పోయినాగాని, క్రిస్మస్ తాత అంటే మాత్రం తెలియకుండా వుండదు. క్రిస్మస్ తాత వస్త్రాలు, అలంకరణ వస్తువుల పేరుతో కోట్ల బిజినెస్ జరుగుతుంది. క్రీస్తు జననానికి, క్రిస్మస్ తాతకు ఎక్కడైనా సంబంధం ఉందా అంటే? లేనే లేదు. *ఆచారాల ముసుగులోపడి, దేవుని ఆరాధించలేక పోతున్నాం.* దేవునికి చెందవలసిన మహిమ వేటికో అర్పిస్తున్నాం. ఇది "సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం" కాదంటారా? *దేవుని యొక్క స్థానాన్ని మరొకటి తీసేసుకుంటే? అది విగ్రహారాధన కాదంటారా?* పది నిమిషాల పిల్లల సంతోషం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు ప్రోత్సహించే మనం నిజరక్షకుని ఎట్లా ఆరాధించాలో వారికి తెలియజేయగలిగితే? వారి జీవితమంతా సంతోషమే కదా! ఈ క్రిస్మస్ లో మనమెందుకు ప్రత్నించ కూడదు? ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్! క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి